YS Vijayamma: వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీచేసిన ప్రత్యేక కోర్టు
- 2012లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పరకాల పీఎస్ లో ఫిర్యాదు
- ఈ నెల 10న కోర్టులో హాజరు కావాలంటూ సమన్లు
- కొండా మురళి, కొండా సురేఖలకు కూడా సమన్లు జారీ
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిలకు హైదరాబాదులోని ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీచేసింది. ఈ నెల 10న హాజరవ్వాలని ఆదేశించింది. రోడ్డుపై అనుమతి లేకుండా సభను నిర్వహించారన్న ఫిర్యాదు నేపథ్యంలో కోర్టు ఈ సమన్లు జారీచేసింది. 2012లో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ ఏర్పాటు చేశారని, తద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పరకాల పోలీస్ స్టేషన్ లో వైఎస్ విజయమ్మ, షర్మిలపై కేసు నమోదైంది. ఈ కేసులోనే తాజాగా సమన్లు జారీ అయ్యాయి.
వారిద్దరితో పాటు తెలంగాణ రాజకీయ నేతలు కొండా సురేఖ, కొండా మురళిలకు కూడా సమన్లు జారీ చేశారు. వీరందరూ జనవరి 10న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉండగా, సీఎం జగన్ సైతం అదే రోజున కోర్టుకు రానున్నారు. ఆయనపై సీబీఐ న్యాయస్థానంలో అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.