Bollywood Actress Twinkle Khanna: అహింసకు ప్రాధాన్యమిచ్చే దేశంలో హింసాయుత దాడులు బాధాకరం: జేఎన్ యూ ఘటనపై నటి ట్వింకిల్
- ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి
- హింసాత్మక ఆందోళనలు ఆపకుంటే..ధర్నాలు, సమ్మెలు పెరుగుతాయి
- ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్ పోస్ట్ చేస్తూ వ్యాఖ్య
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులపై నిన్నరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసిన ఘటనపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సామాజిక మాధ్యమంగా స్పందించారు. అహింసకు ప్రాధాన్యమిచ్చే దేశంలో హింసాయుత దాడులు జరగడం బాధాకరమన్నారు.
‘విద్యార్థులకంటే ఆవులకే ఎక్కువగా రక్షణ ఉన్న మనదేశంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి హింసాయుత ఘటనలు నిరోధించకపోతే, భవిష్యత్తులో ధర్నాలు, సమ్మెలతో మరింతమంది రోడ్లపైకి వస్తారు’ అని తన సందేశంలో తెలిపారు. అంతేకాక, ఈ ఘటనపై వార్తా పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ ను కూడా పోస్ట్ చేశారు.
నిన్నరాత్రి జేఎన్ యూలో ముసుగులు వేసుకున్న కొంత మంది చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి మీరు చేశారంటే మీరు చేశారని విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ధర్నాలకు దిగాయి. యూనివర్సిటీలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.