Hyderabad: హైదరాబాద్ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు!

  • పెట్రోలింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే సరిపోతుంది
  • ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు
  • హైదరాబాద్ కమిషనరేట్ లో అందుబాటులోకి వచ్చిన సేవలు

ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ పోలీసు శాఖ... తాజాగా మరో కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిందే. అయితే, ఇకపై ఆ అవసరం లేదు. పీఎస్ కు వెళ్లకుండానే బాధితులు ఫిర్యాదులు చేయవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజం!

తమ ప్రాంతాల్లో సంచరించే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సరిపోతుంది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. అయితే, ఈ సదుపాయం తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇతర కమిషనరేట్లకు, జిల్లాలకు విస్తరిస్తారు. దేశంలోనే ఈ విధానం మొట్టమొదటగా హైదరాబాదులో అమలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ, ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పీఎస్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు... స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, రైటర్ కానీ అందుబాటులో లేకపోతే... వారు వచ్చేంత వరకు బాధితులు వేచి చూసే పరిస్థితి ఉండేదని... ఇకపై ఆ ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను విస్తృతం చేయబోతున్నామని చెప్పారు.

ఎక్కడ ఏ నేరం జరిగినా ముందుండేది పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బందేనని... వారివల్ల విజిబుల్ పోలీసింగ్ పెరుగుతోందని అంజనీకుమార్ అన్నారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే ఫిర్యాదుదారులు తప్పనిసరిగా తమ పేరు, మొబైల్ నంబరు, పూర్తి చిరునామాను పెట్రోకార్ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి గత నెలంతా కసరత్తు చేశామని చెప్పారు.

Hyderabad
Police
Complaint
New System
  • Error fetching data: Network response was not ok

More Telugu News