Andhra Pradesh: కాసేపట్లో బోస్టన్ నివేదిక జగన్ చేతికి... నిర్ణయం తీసుకుంటామన్న హోంమంత్రి సుచరిత
- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక సిద్ధం
- ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ వద్దకు నివేదిక
- క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందివ్వనున్న బీసీజీ
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు( బీసీజీ) నివేదిక సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు ఆ నివేదికను బీసీజీ ప్రతనిధులు అందజేయనున్నారు. రాజధానిలో సాంకేతిక అంశాలపై బీసీజీ అధ్యయనం చేసింది. మరోపక్క, రాజధానిపై వచ్చిన నివేదికలపై ఈ నెల 6న హైపవర్ కమిటీ భేటీ అవుతుంది. ఈ నెల 8న జరిగే కేబినెట్ లోనూ బీసీజీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుంది.
కాగా, గుంటూరులోని ప్రత్తిపాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత ఈ సందర్భంగా రాజధానిపై మాట్లాడారు. బీసీజీ ఇచ్చే నివేదికను చూసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిని పూర్తిగా తరలిస్తామని తాము చెప్పలేదని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్ భవన్ లను ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.