Jagan: మరో హామీని సగర్వంగా నిలబెట్టుకున్నా: వైఎస్ జగన్
- వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ
- ఆపై విశ్రాంతి సమయంలో నెలకు రూ. 5 వేలు
- వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన జగన్
ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల్లో మరో హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నానని చెప్పేందుకు గర్వపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఏలూరులో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఇంతవరకూ ఆరోగ్య శ్రీ పథకం కింద దాదాపు 1059 వ్యాధులకు మాత్రమే వైద్యం అందేదని, ఇకపై 2,059 వ్యాధులకు వైద్యం అందుతుందని జగన్ ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రోగం నయమైన తరువాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తే, బాధితుడికి నెలకు రూ. 5 వేలు చొప్పున ఇస్తామని జగన్ వ్యాఖ్యానించారు. గత ఏడు నెలలుగా ఆరోగ్య శ్రీ సేవల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చేందుకు ఎంతో కృషి చేశామని చెప్పిన జగన్, పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు మూడు నెలల పాటు కొనసాగుతుందని, ఆరు నెలలు తిరిగేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. నెలకు ఒక జిల్లాను కలుపుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత మంచి పథకం లేదని జగన్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్లకూ ఆరోగ్య శ్రీ వర్తించడం లేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని జగన్ వెల్లడించారు. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్ పేషంట్లకు రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్య చికిత్సలను అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని, ఏ రకమైన క్యాన్సర్ వచ్చినా, ప్రభుత్వమే వైద్యం ఖర్చును భరిస్తుందని తెలిపారు. చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులకు ఇకపై డాక్టర్లకు వేలకు వేలు చెల్లించాల్సిన అవసరం రాబోదని జగన్ వ్యాఖ్యానించారు.