Oregon: మిరాకిల్... 500 అడుగుల పర్వతం పైనుంచి పడినా మృత్యుంజయుడు!
- ఓరెగాన్ రాష్ట్రంలో మౌంట్ హుడ్
- 11,240 అడుగులు ఎక్కిన గురుబాజ్ సింగ్
- అక్కడి నుంచి కిందపడటంతో విరిగిన కాలు
- తలకు హెల్మెట్ ఉండటంతో దక్కిన ప్రాణాలు
16 సంవత్సరాల భారత సంతతి యువకుడు, కెనడాలోని 11,240 అడుగుల పర్వతంపైకి ఎక్కి, ప్రమాదవశాత్తూ, 500 అడుగుల ఎత్తు నుంచి పడి కూడా మృత్యుంజయుడిగా మిగిలాడు. ఈ ఘటన ఓరెగాన్ రాష్ట్రంలోని మౌంట్ హూడ్ వద్ద జరిగింది.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, గురుబాజ్ సింగ్ అనే యువకుడు, స్నేహితులతో కలిసి, 90వ సారి పర్వతారోహణ చేయాలన్న కోరికతో బయలుదేరాడు. ఈ క్రమంలో ఆయన మంచు గడ్డలపై జారాడు. పియర్లీ గేట్స్ అనే ప్రాంతం నుంచి కింద ఉన్న డెవిల్స్ కిచన్ అనే ప్రాంతానికి పడిపోయాడని సీఎన్ఎన్ అనుబంధ కటూ చానెల్ వెల్లడించింది.
దాదాపు 500 అడుగుల లోతునకు గురుబాజ్ సింగ్ పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగిందని, అంతకుమించి ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ జరగలేదని, ఇది ఓ అద్భుతమని కటూ పేర్కొంది. గురుబాజ్ పడిపోయిన తరువాత, విషయం తెలుసుకున్న సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, రంగంలోకి దిగాయి. గాయపడిన గురుబాజ్ ను తాళ్లతో కట్టి, శ్రమపడి పైకి తీసుకుని వచ్చారు.
ఓరెగాన్ ప్రాంతంలో మౌంట్ హుడ్ అత్యంత ఎత్తయిన పర్వతం. సంవత్సరంలో అత్యధిక కాలం మంచుతోనే కప్పబడి వుంటుంది. ప్రతి సంవత్సరం దీన్ని 10 వేల మంది ఔత్సాహికులు అధిగమిస్తుంటారు. "కిందకు పడిపోతున్న సమయంలో ఎక్కడో ఒకచోట ఆగుతానని గురుబాజ్ భావించాడు. పట్టుకోసం ఎంతో ప్రయత్నించి, ప్రాణాలను కాపాడుకున్నాడు" అని అతని తండ్రి రిషమ్ దీప్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా, ప్రస్తుతం బాధితుడికి పోర్ట్ ల్యాండ్ లోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. తలకు హెల్మెట్ పెట్టుకుని ఉండటంతోనే తన ప్రాణాలు దక్కాయని గురుబాజ్ వ్యాఖ్యానించాడు.