Chiranjeevi: ఇదేనా మీరిచ్చే గౌరవం?: రాజశేఖర్ పై నిప్పులు చెరిగిన చిరంజీవి

  • నా మాటకు విలువ లేకుండా పోయింది
  • రసాభాస చేయడానికి పక్కా ప్రణాళికతో వచ్చారు
  • ప్రొటోకాల్ లేకుండా ఎగ్రసివ్ గా మైక్ లాక్కోవడం ఏంటి?
  • రాజశేఖర్ వైఖరిపై చిరంజీవి మండిపాటు

తాను చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందని మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాజశేఖర్ విమర్శల తరువాత, మరోసారి మైక్ తీసుకున్న ఆయన, "నేను ఇందాక చెప్పిన మాటలకు విలువే ఇవ్వలేదు. మంచి వుంటే మైక్ లో చెప్పండి, చెడు వుంటే చెవిలో చెప్పుకుందామని అన్నాను. అది గౌరవం ఇవ్వలేని వారికి... నిజంగా ఇక్కడ ఎందుకు ఉండాలి? పెద్దలుగా మేమంతా ఎందుకు ఉండాలి? ఎందుకు ఇలా రసాభాస చేయడం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే" అని చిరంజీవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఎంతో సజావుగా, హృద్యంగా సాగుతున్న సభలో, ఎగ్రసివ్ గా మైక్ లాక్కుని, గౌరవం లేకుండా, ప్రొటోకాల్ లేకుండా, చేయడం మర్యాద కాదని హితవు పలికారు. ఇప్పుడు కూడా తాను కోపంతో మాట్లాడే వాడిని కాదని, ఎంత సౌమ్యంగా మాట్లాడదామని అనుకున్నా, తనకు కోపం వచ్చేలా చేశారని చిరంజీవి వ్యాఖ్యానించారు. దయచేసి, ఇక ఆపేసి, మంచిని గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఎవరూ కోపావేశాలకు వెళ్లవద్దని, ఫ్యూచర్ ఎయిమ్ గురించి మాట్లాడుకుందామని అన్నారు. మీడియా దీని గురించి చిలువలు, పలవలుగా రాస్తుందని, అవసరమైన విషయాలను పక్కన పెడతారని అన్నారు.

ఆ సమయంలో మరోసారి కల్పించుకున్న రాజశేఖర్, తాను నిజాన్ని మాత్రమే మాట్లాడానని, తాను ఎవరి ముందూ తలవంచుకుని ఉండబోనని చెబుతూ స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం ముందుగా పక్కా ప్రణాళిక వేసుకుని వచ్చి చేశారని, కార్యక్రమాన్ని పాడు చేసే ఉద్దేశం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డ చిరంజీవి, అటువంటి వారికి సమాధానం చెప్పబోనని, మాలోని క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News