New Delhi: భర్తను వదిలేసి, స్నేహితుడితో వెళ్లిపోయిన తెలుగు డాక్టర్ హిమబిందు... సిక్కింలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు!
- సోషల్ మీడియా ఆధారంగా గుర్తింపు
- డిసెంబర్ 25న అదృశ్యమైన హిమబిందు, దిలీప్
- కేసును సాల్వ్ చేసిన పోలీసులు
ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్టరీ వీడింది. వీరిద్దరినీ పోలీసులు సిక్కింలో గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. దిలీప్, హిమబిందులు సిక్కింలో చిక్కారని, సోషల్ మీడియా, వారి ఫోన్ నంబర్ల ట్రాకింగ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. భర్తను వదిలేయాలని నిర్ణయించుకున్న హిమబిందు, తన సహచర విద్యార్థి, డాక్టర్ వృత్తిలోనే ఉన్న దిలీప్ తో కలిసి వెళ్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విచారణ అనంతరం వారిద్దరినీ స్వస్థలానికి తరలిస్తామని ఓ అధికారి తెలిపారు.
కాగా, ఐదు రోజుల క్రితం చర్చ్ కి వెళ్లి వస్తామని చెప్పిన హిమబిందు, దిలీప్ లు అదృశ్యమైన సంగతి తెలిసిందే. తన భార్య స్నేహితుడైన దిలీప్ తో కలిసి వెళ్లిందని, ఆపై ఇద్దరి సెల్ ఫోన్లూ స్విచ్చాఫ్ వచ్చాయని హిమబిందు భర్త, డాక్టర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు, కేసును సీరియస్ గా తీసుకున్నారు.
చండీగఢ్ లో పీడియాట్రిషియన్ గా పనిచేస్తున్న దిలీప్, ఓ ఇంటర్వ్యూ నిమిత్తం వచ్చి, ఢిల్లీలోని శ్రీధర్, హిమబిందు దంపతుల ఇంట్లో దిగారు. వీరంతా గతంలో కర్నూలు మెడికల్ కాలేజిలో కలిసి చదువుకున్నారు. 25న క్రిస్మస్ సందర్భంగా చర్చ్ కి వెళుతున్నానని భర్తకు ఫోన్ లో చెప్పిన హిమబిందు, ఆపై అదృశ్యం అయింది. దీంతో శ్రీధర్ వారి ఆచూకీ కనిపెట్టాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్లను అభ్యర్థించారు.