Chandrababu: చేతి గాజును తీసి అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇచ్చిన చంద్రబాబు భార్య భువనేశ్వరి
- రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి
- రైతులకు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు పిలుపు
- రూ.25 వేలు విరాళంగా ఇచ్చిన వక్కలగడ్డ వాసులు
అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబు భార్య భువనేశ్వరి తన చేతి గాజును విరాళంగా ఇచ్చారు. ఏపీలోని ఎర్రబాలెంలో రైతుల దీక్షలో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన చేతి గాజును తీసి విరాళంగా ఇచ్చారు.
కాగా, నూతన సంవత్సర వేడుకలకు పెట్టాలనుకున్న ఖర్చును అమరావతిలో రాజధాని కోసం నిరసనలు తెలుపుతున్న రైతులకు విరాళంగా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలువురు రాజధాని పరిరక్షణ సమితికి విరాళాలు అందించారు. కొందరు వృద్ధులు తమ పింఛను డబ్బును విరాళంగా ఇచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ వాసులు నూతన సంవత్సర వేడుకలకు అయ్యే ఖర్చును దాదాపు రూ.25 వేలు విరాళంగా అందించారు.