Chandrababu: ఇరవై ఏళ్ల నాటి 'విజన్ 2020'... ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి: చంద్రబాబు
- 2000 దశకం ప్రారంభంలో చంద్రబాబు నినాదం
- నాడు ఉమ్మడి ఏపీ సీఎంగా అభివృద్ధి ప్రణాళికలు
- నేటి తరం యువత అనుభవిస్తోందన్న చంద్రబాబు
'విజన్ 2020' నేటి తరం యువతకు ఈ పేరు తెలియక పోవచ్చుగానీ, ప్రస్తుతం 40 పదుల వయసులో ఉన్న వారందరికీ సుపరిచితమే. 2000 దశకం ఆరంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు, భవిష్యత్ పై దూరదృష్టితో చెప్పిన మాటిది.
2020 లక్ష్యంగా నాడు తాను చేయాలని భావించిన అభివృద్ధి పథకాలు, సంక్షేమానికి బాటలు, ఐటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో డెవలప్ మెంట్ కు స్కీమ్ లు తదితరాలను ప్రకటించారు. అదే సమయంలో హైదరాబాద్ శివారు ప్రాంతమైన మాదాపూర్ లో హైటెక్ సిటీని ప్రకటించారు. హైటెక్ సిటీ నిర్మాణం తరువాత ఆ ప్రాంతం ఎంతగా అభివృద్ధి చెందిందో, ఇప్పుడెలా ఉందో నేటి తరం తెలుగు యువతకు బాగా తెలుసు.
చంద్రబాబునాయుడు 'విజన్ 2020'ని ప్రకటించి 20 సంవత్సరాలు గడిచింది. నేడు తాజాగా ఆయన నాటి తన మాటలను గుర్తు చేసుకున్నారు. తాను చేపట్టిన అభివృద్ధి ప్రణాళికల కారణంగానే, నేడు హైదరాబాద్ విశ్వవ్యాప్తం అయిందని చెప్పారు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన, 2020 సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్ల క్రితమే తాను హైదరాబాద్ ను అన్ని రంగాల్లో, ముఖ్యంగా ఐటీ విభాగంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకు తగ్గ ప్రణాళికలు వేశానని అన్నారు. ఆనాటి తన ఆలోచనల ఫలాలను నేడు తెలుగు రాష్ట్రాల యువత అనుభవిస్తోందని చెప్పారు.