Ganta Srinivasa Rao: నేను ఏం మాట్లాడినా వేరే విషయాలు తెరపైకి తెస్తున్నారు: గంటా శ్రీనివాసరావు
- విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతించా
- అమరావతి రైతులకు కూడా న్యాయం చేయాలి
- న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటా
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, విశాఖను రాజధాని చేయాలనే ప్రతిపాదనను టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించడం చర్చనీయాంశమైంది. పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా గంటా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు టీడీపీలో ఆయన కొనసాగుతారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.
విశాఖ వాసిగా ఇక్కడ రాజధానిని స్వాగతిస్తున్నానని గంటా చెప్పారు. తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారని... సంబంధం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. అమరావతి రైతులకు కూడా న్యాయం చేయాలని చెప్పారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలనే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. అమరావతికి మద్దతివ్వాలనే పార్టీ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.