Venkaiah Naidu: 'తెలుగు వికీపీడియా' కోసం వెంకయ్యనాయుడు ప్రచారం
- తెలుగు భాష అస్తిత్వం కొనసాగాలి
- భవిష్యత్ కు సమాచారం తెలుగులో తెలియాలి
- తెలుగు వికీపీడియాను ప్రమోట్ చేయాలన్న వెంకయ్య
"తెలుగు భాష అస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సంస్కృతి సంప్రదాయాలు, సాహిత్యం, కళలు వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఈ సమాచారమంతా తెలుగులో అందుబాటులోకి రావాలి" అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. తెలుగు వికీ పీడియా 'తెవికీ'ని ప్రమోట్ చేయాలని కోరుతూ వరుస ట్వీట్లు చేశారు.
"నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర, గొప్పదనాన్ని యువతరానికి తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో 'తెలుగు వికీపీడియా' వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిజిటల్ విభాగం చేస్తున్న కృషికి హార్దిక అభినందనలు" అని అన్నారు. ఆపై "ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తెలుగు వారిగా మనమంతా బాధ్యత తీసుకోవాలి. మనకు లభించే విశ్వసనీయమైన సమాచారాన్ని 'తెవికీ' ద్వారా అందరికీ అందించేలా కృషి చేయాలి" అని కోరారు. ఇక ఈ ట్వీట్ లను ఆయన 'తెవికీ', 'తెలుగు', 'తెలంగాణ సీఎంఓ'కు ట్యాగ్ చేశారు.