genes changed chinese scientist: జన్యు మార్పులు చేసిన చైనా శాస్త్రవేత్తకు మూడేళ్ల జైలు శిక్ష

  • చట్ట వ్యతిరేక వైద్య కార్యకలాపాలు.. రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష
  • హెచ్‌ఐవీ సోకిన పురుషుడు, హైచ్‌ఐవీ లేని  స్త్రీపై ప్రయోగం
  • జన్మించే శిశువులకు హెచ్ఐవీ రాకుండా చేసేందుకే ప్రయోగమన్న శాస్త్రవేత్త

మానవ పిండాల జన్యువుల్లో సవరణలు చేశానంటూ గతేడాది ప్రపంచ దృష్టిని ఆకర్షించిన  చైనా శాస్త్రవేత్త హే జియాన్‌కుయ్‌‌కి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ‘‘చట్ట వ్యతిరేక వైద్య కార్యకలాపాలు’’ కొనసాగించినట్టు రుజువు కావడంతో దక్షిణ చైనాలోని షెన్‌‌జెన్ ట్రయల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

 స్థానిక మీడియా కథనం ప్రకారం.. హెచ్‌ఐవీ సోకిన ఓ పురుషుడు, హైచ్‌ఐవీ లేని ఓ స్త్రీతో కూడిన జంటను తన ప్రయోగంలో ఉపయోగించుకునేందుకు, ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించినట్టు జియాన్‌కుయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొత్తగా జన్మించే శిశువులకు హెచ్ఐవీ సోకకుండా నిరోధించేందుకే తాను ఈ ప్రయోగం చేసినట్టు సదరు శాస్త్రవేత్త చెప్పినప్పటికీ.. అతడు వైద్యాధికారులను, పౌరులను మోసం చేసినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది.
 
గతేడాది హాంకాంగ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈ 35 ఏళ్ల యువ శాస్త్రవేత్త... తాను ప్రపంచంలోనే తొలిసారి జన్యు మార్పులు చేసిన కవలలను సృష్టించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హే జియాన్‌కుయ్‌ సృష్టించిన కవలల సంరక్షణపై చైనా ఇంజనీరింగ్‌ అకాడమీ ఆందోళన వ్యక్తం చేసింది.

జన్యు సవరణతో ఆ కవలలకు కలిగిన ఆరోగ్యపరమైన నష్టాన్ని భర్తీ చేసే దిశగా చర్యలు చేపట్టాలని అకాడమీ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో నైతిక విలువలకు విరుద్ధంగా జన్యు సవరణ ప్రయోగాలు జరిపినందుకు చైనా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగ నిర్వాహకులు, వారికి తోడ్పాటు అందించేవారిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News