Railway Property damaged: నిరసనకారుల నుంచి రూ.80 కోట్లు వసూలు చేస్తాం: రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్
- సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రైల్వే ఆస్తుల ధ్వంసం
- ఈస్ట్రన్ రైల్వేకు రూ.70కోట్ల నష్టం
- నార్త్ ఫ్రాంటియర్ రైల్వే రూ.10 కోట్ల మేర నష్టపోయింది
సీఏఏకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల్లో విధ్వంసకారులు నాశనం చేసిన రైల్వే ఆస్తుల విలువను తిరిగి రాబడతామని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ నిరసనల్లో రూ.80కోట్ల విలువైన రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు. ఈ రోజు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ఈస్ట్రన్ రైల్వే రూ.70కోట్ల విలువైన ఆస్తులను నష్టపోగా, నార్త్ ఫ్రాంటియర్ రైల్వే రూ.10 కోట్ల మేర తన ఆస్తులను పోగొట్టుకుందని తెలిపారు.
ఆందోళనల్లో ఆస్తుల ధ్వంసం చేసిన నిరసనకారులను గుర్తించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయం తీసుకుంటుందన్నారు. ఆందోళనకారులు పలు ఫ్యానల్స్ కు నిప్పంటించడమేకాక, ఆరు రైల్వే స్టేషన్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారన్నారు. పదిహేనుకు పైగా రైల్వే స్టేషన్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయన్నారు. కాగా, రైల్వే శాఖ తనకు జరిగిన నష్టంపై పరిహారం ఇప్పించాలన్న డిమాండ్ తో కోర్టుకు వెళ్లాలని గతవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.