Vivo: స్మార్ట్ ఫోన్ యూజర్లకు వివో షాక్... తగ్గింపు ధరలకు ఆన్ లైన్ అమ్మకాలు నిలిపివేత!

  • రూరల్ మార్కెట్ పై కన్నేసిన వివో
  • ఆఫ్ లైన్ అమ్మకాలు పెంచుకునే యత్నం
  • జనవరి తొలి వారంలో కొత్త ఫోన్ లాంచ్

కొత్త సంవత్సరంలో ఆన్ లైన్ మాధ్యమంగా ప్రత్యేక ఆఫర్లతో స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఉండవని చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో షాకిచ్చే వార్తను చెప్పింది. తమ సంస్థ ఫోన్లను విక్రయించే రిటెయిలర్లకు మేలు కలగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో ఆన్ లైన్లో ఏ ధరలకు తమ ఫోన్లు అందుబాటులో ఉంటాయో, రిటెయిలర్ల వద్ద కూడా అవే ధరలకు దొరుకుతాయని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ పేర్కొన్నారు. అన్ని రకాల ఉత్పత్తులనూ స్టాండర్డ్ రేట్స్‌ కే అందుబాటులో ఉంచుతామని ఆన్‌ లైన్ తో పాటు, ఆఫ్‌ లైన్‌ లోనూ ఆఫర్లు ఉంటాయని తెలిపారు.

కాగా, ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న సంస్థల్లో ఒకటైన వివో, ఆఫ్ లైన్ మార్కెట్ పై, ముఖ్యంగా రూరల్ మార్కెట్ పై దృష్టిని సారించాలని నిర్ణయించుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివో తాజా నిర్ణయాన్ని ఐమ్రా (ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్) స్వాగతించింది.

ఇదిలావుండగా, జనవరి తొలివారంలో ఎస్ 1 ప్రో పేరిట కొత్త స్మార్ట్‌ ఫోన్ ను వివో ఆవిష్కరించనుంది. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్‌, 6.38 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ ప్లే, స్నాప్‌ డ్రాగన్ 665 సాక్‌ ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 48 ఎంపీ క్వాడ్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. దీని ధరపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

  • Loading...

More Telugu News