Jagan: జగన్ పరిపాలన ఎలా ఉందన్న ప్రశ్నకు టీ-మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- జగన్ పాలనపై ఒక్క ముక్కలో చెప్పమన్న ఓ నెటిజన్
- జగన్ పరిపాలన బాగుందన్న కేటీఆర్
- ఏపీలో కూడా టీఆర్ఎస్ ఏర్పాటు చేయమని కోరిన మరో నెటిజన్
ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘# ASKKTR@KTRTRs’ పేరిట నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన గురించి ఒక్క ముక్కలో చెప్పండి అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ, జగన్ పరిపాలన బాగుందని భావిస్తున్నట్టు చెప్పారు.
రాత్రి సమయాల్లో జరిగే బిల్డింగ్స్ లేదా ఇళ్ల నిర్మాణాల శబ్ద కాలుష్యం కారణంగా నిద్రపట్టడం లేదని, చిన్నారులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై స్పందించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరో నెటిజన్ కోరగా, వివరాలు మెయిల్ చేయమని కేటీఆర్ సూచించారు.
ఏపీలో రెండు రాజకీయపార్టీలు పరస్పరం శత్రుత్వ ధోరణితో ఉండటంతో విసిగిపోయామని, తమ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామని ఇంకో నెటిజన్ కోరగా.. ఆ నెటిజన్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సరైన నాయకత్వం లేదన్న వ్యాఖ్యలు విన్నానని, ఇప్పుడు ఏపీ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వింటున్నానని చెప్పారు. ఇది కేసీఆర్ నాయకత్వానికి వచ్చిన గుర్తింపు అని కొనియాడారు.