Daggubati Ramanayudu: దివంగత నిర్మాత రామానాయుడి ఇంట్లో చోరీ, బంగారం, 10 కేజీల వెండి అపహరణతో కలకలం!

  • ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగతనం
  • ఈ ఇంట్లో ఉంటున్న రామానాయుడి సోదరుడు రామ్మోహన్ రావు
  • హైదరాబాద్ కు వెళ్లిన రామ్మోహన్ రావు దంపతులు
  • పక్కా ప్లాన్ తో దొంగతనం

దివంగత టాలీవుడ్ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ప్రకాశం జిల్లా కారంచేడు, చినవంతెనలోని ఆయన స్వగృహంలో ఈ దొంగతనం జరిగింది. అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు, అందినకాడికి దోచుకుని పోయారు. ప్రస్తుతం ఈ ఇంట్లో రామానాయుడు సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్ రావు నివాసం ఉంటున్నారు. స్థానిక చినవంతెన, సెంటర్ లైబ్రరీ బజారులో ఇల్లు ఉంది. ఈ నెల 16న రామ్మోహన్ రావు దంపతులు హైదరాబాద్ కు వెళ్లగా, విషయం తెలుసుకున్న దొంగలు, పక్కా ప్లాన్ తో ఈ పని చేశారు. బీరువాలు, అలమరాలు పగులగొట్టి, మూడు సవర్ల బంగారంతో పాటు, 10 కిలోల వెండి, రూ. 60 వేల నగదు పోయినట్టు సమాచారం.

శనివారం ఉదయం ఇంటి పనులు చేసే నరసింహరావు, సుజాత దంపతులు రాగా, తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి, ఊరిలోనే ఉండే ఆఫీస్ మేనేజర్ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు, వివరాలు సేకరించారు. హైదరాబాద్ లోని రామ్మోహన్ రావుకు విషయం చేరవేశామని, ఆయన వచ్చిన తరువాత చోరీ సొత్తుపై పూర్తి అవగాహన వస్తుందని పోలీసులు తెలిపారు.

Daggubati Ramanayudu
Theft
Karamchedu
Producer
  • Loading...

More Telugu News