Jesus: ఏసుక్రీస్తు విగ్రహంపై డీకే శివకుమార్ వివరణ
- విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని ప్రజలు నన్ను కోరారు
- వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా
- రాజకీయాల కోసం ఇది చేయలేదు
బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరోబెలెలో 114 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహానికి శంకుస్థాపన చేసిన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో శివకుమార్ వివరణ ఇస్తూ, ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నానని చెప్పారు.
తమ ప్రాంతంలో ఏసుక్రీస్తు విగ్రహం లేదని... విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని అక్కడివారు తనను అడిగారని... తప్పకుండా సహాయం చేస్తానని వారికి తాను మాట ఇచ్చానని... ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. రాజకీయాల కోసమో లేక అధికారం కోసమో తాను ఈ పని చేయలేదని అన్నారు. జీవితంలో మానసిక సంతృప్తి కోసం కూడా కొన్ని చేయాల్సి ఉంటుందని చెప్పారు.
తన నియోజకవర్గంలో వందలాది దేవాలయాలను నిర్మించానని శివకుమార్ తెలిపారు. మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాలయాల కోసం 30 ఎకరాల స్థలాన్ని ఇచ్చానని చెప్పారు. ఎన్నో సంస్థలకు భూములు కొని విరాళం ఇచ్చానని తెలిపారు.