Hyderabad: హెచ్ సీయూలో విద్యార్థులు, సిబ్బంది తరలింపు కోసం ఈ-రిక్షాలు!
- వర్శిటీ ప్రాంగణంలో ఆటో రిక్షాలు
- బెంగళూరు సంస్థకు నిర్వహణ బాధ్యతలు
- చార్జీలు విధించడంపై విద్యార్థుల అసంతృప్తి
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సీయూ)లో సరికొత్త రవాణా సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు, సిబ్బంది తరలింపు కోసం ఆటో ఈ- రిక్షాలు ప్రవేశపెట్టారు. హెచ్ సీయూలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది మొత్తం 6 వేల వరకు ఉంటారు. ఇప్పటివరకు వర్శిటీ ప్రాంగణంలో ఉచిత బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఈ బస్సుకు తోడు రిక్షాలు కూడా రంగప్రవేశం చేశాయి. అయితే రిక్షాల్లో ప్రయాణానికి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా డిజిటల్ పేమెంట్ తరహాలో చెల్లించాలి.
కాగా, ఈ రిక్షాల నిర్వహణను బెంగళూరుకు చెందిన మెస్సర్స్ ట్రాన్స్ వాహన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. ఈ రిక్షాలు మెయిన్ గేటు నుంచి సౌత్ గేటు వరకు, సౌత్ క్యాంపస్ నుంచి చిన్నగేటు వరకు రాకపోకలు సాగిస్తాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రిక్షాల్లో దివ్యాంగులకు ప్రయాణం ఉచితం. వారు తమ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
అయితే, ఈ రిక్షాల వ్యవస్థను విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థుల నుంచి చార్జీలు వసూలు చేయడం ఏంటని అడుగుతున్నారు. క్యాంపస్ లో ఉచిత బస్సు ట్రిప్పుల సంఖ్యను పెంచాల్సింది పోయి, రిక్షాలు తీసుకురావడం, వాటికి చార్జీలు చెల్లించాల్సి రావడం సరైన విధానం కాదని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.