Andhra Pradesh: అసెంబ్లీలో రాజధానిపై సీఎం జగన్ చేసింది ప్రకటన కాదు: పేర్ని నాని వివరణ
- ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ
- మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని
- సీఎం జగన్ ప్రస్తావన తీసుకువచ్చిన మంత్రి
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల ఫలితంగా రేగిన నిరసనజ్వాలలు నేటికీ ఆరలేదు. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు. ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసింది ప్రకటన కాదని, ఏ వ్యవస్థ ఎక్కడ ఉండే అవకాశం ఉందో వెల్లడిస్తూ, జీఎన్ రావు కమిటీ నివేదికపై తన అంచనాను మాత్రమే ఆయన వెల్లడించారని స్పష్టం చేశారు. అయితే న్యాయనిపుణుల సలహా మేరకే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
చంద్రబాబులాగా, లోకేశ్ లాగా అవసరాల కోసం అడుగులు వేసేవాళ్లం కాదని, జీఎన్ రావు ఎంతో బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఆయన నివేదికను గౌరవించాలని సూచించారు. ఎవరికోసమో కాకుండా, రాష్ట్ర పరిస్థితులను వాస్తవికంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల రైతుల గురించే కాకుండా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ పరిగణనలోకి తీసుకునే విధంగానే సీఎం జగన్ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు సాధ్యమైనంత మేర సాయం చేయాలనే వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు.
ఆయనకు ఎవరూ శత్రువులు ఉండే పరిస్థితి లేదని, సామరస్యపూర్వకంగా వెళ్లాలనుకునే వ్యక్తి అని కొనియాడారు. "చాలామంది అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎంతసేపూ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకునేందుకు జీఎన్ రావు కమిటీ వేశారని, ఓ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తిరుమల ఆలయంలోకి చెప్పులేసుకెళ్లారని ఎలా ఆరోపించారో, ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివే" అని వివరించారు.