IMD: న్యూఢిల్లీలో 1901 తర్వాత మళ్లీ కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రత!
- రాజధానిని వణికిస్తున్న చలిపులి
- ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 12.10 డిగ్రీలు
- మరింతగా ఉష్ణోగ్రత తగ్గుతుందన్న ఐఎండీ
దేశ రాజధాని న్యూఢిల్లీని చలి పులి వణికిస్తోంది. దాదాపు 120 సంవత్సరాల తరువాత ఈ డిసెంబర్, అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలను చూడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 12.10 డిగ్రీలకు పడిపోగా, ఇది ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 19.85 డిగ్రీలకు తగ్గింది.
1997 డిసెంబర్ లో 17.30 డిగ్రీల సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఈ సంవత్సరం అంతకన్నా తక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని అంటున్నారు. 1901 నుంచి 2018 మధ్య కేవలం నాలుగు సంవత్సరాల్లో... అంటే, 1919, 1929, 1961, 1997 సంవత్సరాల్లో గరిష్ఠ సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీలకన్నా దిగువకు పడిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లో ఈ నెల 18న సఫ్దర్ గంజ్ ప్రాంతంలో 12, పాలమ్ ప్రాంతంలో 11.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 29 నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం చివరి రోజున వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.