Venkaiah Naidu: మనకు వాళ్ల భాష నేర్పారు కానీ, మన భాష వాళ్లు నేర్చుకోలేదు: వెంకయ్యనాయుడు
- మాతృభాషపై వెంకయ్య మమకారం
- ఓ కార్యక్రమంలో భాష గురించి ప్రస్తావన
- భాషను రాజకీయం చేయొద్దంటూ హితవు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంగ్లీషు మీడియం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఇక్కడికి వచ్చి వాళ్ల భాషను మనకు నేర్పారే తప్ప మన భాషను వాళ్లు నేర్చుకోలేదని అన్నారు.
సాధారణంగా వ్యాపారం కోసం మరో ప్రాంతానికి వెళ్లినవాళ్లు అక్కడి భాషను నేర్చుకుని స్థానికులతో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తారని, కానీ బ్రిటీష్ వాళ్లు తద్విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. అప్పటినుంచి మనవాళ్లలో ఇంగ్లీషు భాష నేర్చుకోకపోతే వెనుకబడిపోతామేమోనన్న బలహీన భావన ఏర్పడిందని వివరించారు. ఈ సందర్భంగా దేవుడికి, భాషకు, మరణానికి ముడిపెడుతూ చమత్కరించారు.
"ఆ మధ్యన దేవుడితో మాట్లాడాను. పైకి రావాలంటే ఏమైనా భాషా పరిమితి ఉందా? అని అడిగాను. వాళ్లు ఏ భాషతోనూ పనిలేదన్నారు, టైమయిపోతే ఎవరైనా పైకి రావొచ్చని చెప్పారు. ఇది సరదాగానే చెప్పాను. కొంతమంది అంటుంటారు, సార్ మనం ఇంగ్లీషు మీడియం చదువుకోకపోతే పైకి ఎదగలేమంటారు. కానీ రాష్ట్రపతి ఏ మీడియంలో చదువుకున్నారు? ఉపరాష్ట్రపతినైన నేను వీధి బడిలో చదువుకున్నాను. ప్రధానమంత్రయితే కాన్వెంటు ముఖం కూడా చూడలేదు. చాలా మంది సీఎంల పరిస్థితి ఇదే. కానీ వాళ్లందరూ ఎంతో ఉన్నతస్థాయికి చేరారు. అందుకు కారణం సాధన, అంకితభావం, శ్రమించే తత్వం. ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలి, కానీ అంతకుముందు మాతృభాషను నేర్చుకోవాలి.
మనం జనంతో మాట్లాడాలంటే జనం భాషను నేర్చుకోవాలి. జనం భాష అంటే అందరి భాష. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఈ మధ్య భాషను కొందరు రాజకీయం చేస్తున్నారు. మాతృభాష కళ్ల లాంటిది అయితే, పరాయిభాష కళ్లద్దాల వంటిది. కళ్లుంటేనే కళ్లద్దాలు పనిచేస్తాయి, అసలు కళ్లే లేవనుకోండి కళ్లద్దాలు కూడా పనిచేయవు. మీరు రేబాన్ గ్లాసులు పెట్టుకున్నా కళ్లు లేకపోతే ఏమీ ఉపయోగంలేదు.
ఇంగ్లీషు మీడియంను కూడా ప్రోత్సహిద్దాం కానీ, ప్రైమరీ బోధన తెలుగు మీడియంలోనే సాగాలి. మనది భాషా ప్రయుక్త రాష్ట్రం కాబట్టి తెలుగు మీడియం తీసేయడం అనే ప్రశ్నే ఉండకూడదు. కొంతమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని మమ్మీ, డాడీ అనమంటారు. కానీ అమ్మా అన్న పిలుపులో ఉండే మార్దవం మమ్మీ అనే పదంలో ఎక్కడుంది? మమ్మీ అనే పదం పెదవుల మీద నుంచే వస్తుంది తప్ప లోపలి నుంచి రాదు. కావాలంటే మీరు ఇళ్లలో ఓ ట్రయలేసి చూడండి! ఏదేమైనా మాతృభాషను విస్మరించొద్దు" అంటూ ప్రసంగించారు.