Tamilnadu: తమిళనాట చలన చిత్ర పరిశ్రమ వైఖరిని నిరసిస్తూ.. థియేటర్ల సంఘం పోరాటం
- వంద రోజుల ముందు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సినిమా విడుదల చేయొద్దు
- రాష్ట్ర ప్రభుత్వం సినిమాలపై విధిస్తున్న 8శాతం వినోద పన్నును రద్దు చేయాలి
- పెద్ద చిత్రాల కారణంగా నష్టాలు వస్తే..నష్టాన్ని చిత్ర నటీనటులే భరించాలి
తమిళనాట చలన చిత్ర పరిశ్రమపై థియేటర్ల సంఘం పోరాటం ప్రారంభించింది. తమ డిమాండ్లపై చిత్ర పరిశ్రమ దృష్టి సారించాలని లేకపోతే.. థియేటర్లను మూసివేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని.. ఒకవైపు పైరసీ సమస్య, మరోవైపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తో సాధారణ ప్రేక్షకులు థియేటర్లవైపు కన్నెత్తి చూడటం లేదని తమిళనాడు థియేటర్స్ సంఘం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తాము థియేటర్లను ఏ విధంగా నడపాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. థియేటర్స్ ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయని ఎత్తి చూపింది.
ఈ పరిస్థితుల్లో మార్పు లేకపోతే థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని థియేటర్స్ సంఘం చలన చిత్ర పరిశ్రమను హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం సినిమాలపై విధిస్తున్న 8శాతం వినోద పన్నును రద్దు చేయాలని పేర్కొంది. అంతేకాక, పెద్ద చిత్రాల కారణంగా నష్టాలు వస్తే.. ఆ నష్టాన్ని చిత్ర నటీనటులే భరించాలని థియేటర్స్ సంఘం డిమాండ్ చేసింది. సినిమా విడుదలకు వంద రోజుల ముందు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయకూడదని కూడా సూచించింది. ఈ డిమాండ్లకు ఒప్పుకోవాలని లేకపోతే వచ్చే ఏడాది మార్చి 1 నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. దీనిపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్పందించాల్సి ఉంది.