Rahul Gandhi: రాహుల్, ప్రియాంకలు లైవ్ పెట్రోలు బాంబులు.. హర్యానా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- సీసీఏ వ్యతిరేక ఆందోళనల్లో మరణించిన ఇద్దరు వ్యక్తులు
- పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంక
- అడ్డుకున్న పోలీసులు.. వెనుదిరిగిన నేతలు
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇద్దరూ ‘లైవ్ పెట్రోలు బాంబులు’అంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారెక్కడికి వెళ్లినా మంటలు పెట్టి ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తుంటారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో మరణించిన ఇద్దరు బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక, రాహుల్‌లు మీరట్ చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమను మీరట్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఇందుకు సంబంధించి రాతపూర్వకంగా తమకు ఎటువంటి ఉత్తర్వులు పోలీసులు చూపించలేదని రాహుల్ మండిపడ్డారు.
అయితే, పోలీసుల వాదన మరోలా ఉంది. మీరట్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిషేధ ఉత్తర్వుల కాపీని చూపించడంతో వారు వెనుదిరిగారని మీరట్ సీనియర్ ఎస్పీ అజయ్ సాహ్నీ తెలిపారు. ఈ ఘటన అనంతరం అనిల్ విజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లైవ్ పెట్రోలు బాంబులాంటి వారైన వారిద్దరూ ఎక్కడికి వెళ్తే అక్కడ మంటలు తథ్యమని చేసిన ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.