sabarimala: 27న ముగియనున్న మండలపూజ.. శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు
- 26న ఉదయం 7:30 గంటల నుంచి నాలుగు గంటలపాటు ఆలయం మూత
- ఎరుమేలి-పంబ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- అయ్యప్ప నామ స్మరణతో హోరెత్తుతున్న శబరిగిరులు
అయ్యప్ప భక్తులతో శబరిగిరులు పోటెత్తుతున్నాయి. ఈ నెల 27న మండలపూజ ముగియనుండడంతో స్వామి దర్శనం కోసం వేలాదిమంది భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఇరుముళ్లతో కొండకు చేరుకుంటున్న భక్తులతో శబరిగిరి దారులు కిక్కిరిసిపోయాయి. ఎరుమేలి నుంచి పంబకు వెళ్లే మార్గంలో విపరీతమైన రద్దీ ఏర్పడడంతో ఐదు కిలోమీటర్ల మేర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సన్నిధానం వద్ద భక్తులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
మరోవైపు, ఎల్లుండి సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఉదయం 7:30 గంటల నుంచి నాలుగు గంటలపాటు అంటే ఉదయం 11:30 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ మూసివేతకు ముందే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.