Manoj Naravane: భారత గూఢచారులంటే జేమ్స్ బాండ్ లా, గన్స్, అమ్మాయిలతో ఉండరు: మనోజ్ నారావణే కీలక వ్యాఖ్యలు!
- ఇంటెలిజెన్స్ లేకుంటే ఆర్మీ కార్యకలాపాలు విజయవంతం కాబోవు
- నిఘా విభాగం ప్రపంచం మరోలా ఉంటుంది
- ఎంతో సమాచారాన్ని సేకరించి, విశ్లేషించాలి
- పుస్తకావిష్కరణలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నారావణే
భారత గూఢచారులంటే జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరిగా గన్స్ పట్టుకుని తిరుగుతూ, అమ్మాయిలతో కాలక్షేపం చేస్తూ ఉండబోరని త్వరలో ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ నారావణే వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ విభాగం ప్రజలు అనుకునేలా గ్లామరస్ గా ఉండదని ఆయన అన్నారు. నితిన్ గోఖలే రాసిన 'ఆర్ ఎన్ కావో జెంటిల్ మన్ స్పై మాస్టర్' పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.
మిలిటరీ ఆపరేషన్స్ విజయవంతం వెనుక గూఢచారుల పాత్ర ఎంతో ఉంటుందని ఆయన అన్నారు. భారత రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) తొలి చీఫ్ గా ఆర్ఎన్ కావో ఎంతో సేవ చేశారని కొనియాడారు. మిలిటరీ ఆపరేషన్స్, నిఘా విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తుంటాయని, ఎప్పుడు ఆర్మీ ఆపరేషన్స్ గురించి తమకు తెలిసినా, శత్రువుల గురించిన వార్తలు సేకరించడమే తమ విధి అని ఆయన అన్నారు. తమ కార్యకలాపాలు విజయవంతం అవుతాయంటే, ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం అత్యంత కీలకమని అన్నారు.
"గూఢచార కార్యకలాపాల గురించి ఆలోచిస్తే, సాధారణంగా జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కావాల్సినంత గ్లామర్, తుపాకులు, అమ్మాయిలతో రాస క్రీడలు అనుకుంటారు. కానీ నిఘా విభాగం ప్రపంచం వేరేలా ఉంటుంది. జాన్ లీ కారే రాసే స్పైలీ నవలల్లోలా పరిస్థితి వుండదు. పరిచయం లేని, వినని ప్రాంతాల్లో, పరిస్థితుల్లో పనిచేయాల్సి వుంటుంది" అని ఆయన అన్నారు. ఎంతో సమాచారాన్ని క్రోడీకరించి, సమాచారాన్ని పంచుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ కావోతో కలిసి పనిచేసిన రా మాజీ ప్రత్యేక కార్యదర్శి వీ బాలచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.