Aryaman Birla: క్రికెట్ కు విరామం ప్రకటించిన అపర కుబేరుడు!
- ఆటకు తాత్కాలికంగా దూరమైన ఆర్యమన్ బిర్లా
- ఆర్యమన్ ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం తనయుడు
- మానసిక సమస్యలతో తప్పుకుంటున్నట్టు వివరణ
భారత్ లోని సంపన్న వర్గాల్లో బిర్లా కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సాధారణంగా ధనిక కుటుంబాల్లోని పిల్లలు పెద్దల వారసత్వంగా వ్యాపార రంగంలోనే కొనసాగుతుంటారు. అయితే, బిర్లాల వారసుడు ఆర్యమన్ బిర్లా మాత్రం క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడమే కాదు, దేశవాళీ క్రికెట్లో సైతం ఆడాడు. గత రెండేళ్లుగా మధ్యప్రదేశ్ రంజీ టీమ్ లో కొనసాగుతున్న ఆర్యమన్ తాజాగా క్రికెట్ కు విరామం ప్రకటించాడు.
మానసిక సమస్యలతోనే ఆట నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. అనేక సమస్యలను అధిగమించిన తాను వ్యక్తిగత సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నానని, అందుకే కొన్నాళ్లు ఆట నుంచి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నానని ఈ అపర కుబేరుడు వివరించాడు. ఆర్యమన్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తనయుడు. క్రికెట్ పై ప్రేమతో ఆటలో శిక్షణ పొందిన ఆర్యమన్ మధ్యప్రదేశ్ జట్టు తరఫున 9 దేశవాళీ మ్యాచ్ లు ఆడి 27.60 సగటుతో 414 పరుగులు చేశాడు. వాటిలో ఓ సెంచరీ కూడా ఉంది.
కాగా, క్రికెట్ తన జీవితంలో భాగమని, త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానంటూ ఈ యువ ఆటగాడు ట్వీట్ చేశాడు.