Boston: బోస్టన్ గ్రూపు నివేదిక కోసం ఎదురుచూస్తున్న ఏపీ సర్కారు!
- రాజధానిపై అధ్యయనం నిర్వహిస్తోన్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు
- జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ గ్రూపునకు కూడా బాధ్యతలు అప్పగింత
- ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిన బోస్టన్ గ్రూపు
రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీ రాజధాని అమరావతేనా లేక, సీఎం జగన్ చెప్పినట్టు మూడు నగరాలా అనేదానిపై గందరగోళం నెలకొంది. జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం మూడు రాజధానులే ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మరో కీలక నివేదిక కోసం ఎదురుచూస్తోంది. రాజధాని వ్యవహారంపై జీఎన్ రావు కమిటీ మాత్రమే కాదు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) కూడా అధ్యయనం చేస్తోంది.
రాజధానిపై ఓ మధ్యంతర నివేదిక సమర్పించిన బీసీజీ ప్రస్తుతం పూర్తిస్థాయి నివేదికపై కసరత్తులు చేస్తోంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెలాఖర్లో జీఎన్ రావు కమిటీ నివేదికపై సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ లో చర్చించనున్నారు. అంతేకాదు, ఈ నివేదికను అఖిలపక్షం ముందుంచే సాధ్యాసాధ్యాలను కూడా సర్కారు పరిశీలిస్తోంది.