Andhra Pradesh: 'నా ఇష్టం.. రెండు మూడు రోజుల్లో రాజధానిని మార్చేస్తున్నాను'.. తుగ్లక్ సినిమాలోని డైలాగులు వినిపించిన దేవినేని ఉమ!
- దేశ రాజధాని మార్పుపై అప్పట్లో తుగ్లక్ ఏమన్నారో మనం సినిమాల్లో చూశాం
- అది రాచరికం.. ఇది ప్రజాస్వామ్యం..
- మీ ఇష్టారాజ్యంగా రాజధానిని మార్చుతామంటే కుదరదు
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'దేశ రాజధాని మార్పుపై అప్పట్లో తుగ్లక్ గారు ఏమన్నారో మనం సినిమాల్లో చూశాం. ఇప్పుడు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు తుగ్లక్ సినిమాలో ఆ పాత్రధారి ఏం మాట్లాడారో వినిపిస్తాను. ఆ డైలాగులను జగన్ కి, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తాను' అని ఓ వీడియో చూపించారు.
ఆ సినిమాలో తుగ్లక్ మాట్లాడుతూ... 'నా ఇష్టం రెండు మూడు రోజుల్లో రాజధానిని మార్చేస్తున్నాను.. అప్పుడు అంతా మనచేతుల్లోకి వస్తుంది' అంటాడు. దీంతో 'రాజధానిని మార్చుతారా మొన్ననేగా ఢిల్లీ నుంచి ఇక్కడకు రాజధానిని మార్చారు?' అని ఓ వ్యక్తి అంటాడు.
దీంతో తుగ్లక్ మళ్లీ మాట్లాడుతూ... 'నా ఇష్టం రాజధాని దేశానికి మధ్యలో ఉండాలని చెప్పి అప్పుడు మార్చాను... ఇక్కడేవీ సౌకర్యాలు లేవని చెప్పి ఇప్పుడు మార్చుతాను.. తప్పా? ఇక ఎవరూ ఏమీ మాట్లాడొద్దు' అని అంటాడు.
ఈ వీడియో చూపించిన అనంతరం దేవినేని ఉమ మాట్లాడుతూ... 'తుగ్లక్ మాట్లాడిన మాటలు విన్నాం. అది రాచరికం.. ఇది ప్రజాస్వామ్యం.. మీ ఇష్టారాజ్యంగా రాజధానిని మార్చుతాం.. రైతుల భూములు తిరిగిచ్చేస్తాం అని మీ మంత్రులు మాట్లాడుతున్నారు' అని అన్నారు.
'దక్షిణాఫ్రికా రాజధానుల గురించి జగన్ మాట్లాడారు. ఈ రాజధానుల మీద ఆ దేశ అధ్యక్షుడే అప్పట్లో విమర్శలు గుప్పించారు' అని దేవినేని ఉమ అన్నారు. అందుకు సంబంధించిన వీడియోను చూపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణాఫ్రికాతో ఎలా పోల్చుతున్నారు? అని నిలదీశారు. ఆ దేశంలో మూడు రాజధానుల వల్ల ఆ దేశం ఎంతగా దెబ్బతిందో తెలియదా? అని ప్రశ్నించారు.