Telugudesam former minister P. Narayana urged YCp govt: రాజధాని విషయంలో మేం తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకోండి.. రైతుల్ని మాత్రం క్షోభ పెట్టకండి: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ
- భూములిచ్చిన రైతులను కష్టాలకు గురిచేయొద్దు
- 13 జిల్లాలకు సమాన దూరంలో ఉందనే అమరావతిని ఎంపికచేశాం
- రైతులు 58 రోజుల్లోనే 33వేల ఎకరాలు ప్రభుత్వానికిచ్చారు
ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వెనక తాము ఏమైనా తప్పుచేసినా లేదా అక్రమాలకు పాల్పడినా.. తమపై చర్యలు తీసుకోవాలే కాని రాజధానికోసం భూములు త్యాగం చేసిన రైతులను మాత్రం క్షోభ పెట్టద్దని టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ అన్నారు. నారాయణ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉంటుందన్న కారణంగా నాడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని పేర్కొన్నారు.
రాజధానికోసం జగన్ 30 వేల ఎకరాలు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. రైతులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకోసం 58 రోజుల్లోనే 33వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉంటే బాగుంటుందన్నారు. తనకు తొలుత 3,129 ఎకరాలున్నాయన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు 55 ఎకరాలున్నాయంటున్నారని మండిపడ్డారు. రాజధానిపై సీఎం జగన్ పునరాలోచన చేయాలని సూచిస్తూ.. రైతుల గోడును ఆలకించాలన్నారు.