Andhra Pradesh: ఏపీ రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్రగా విడిపోతుంది: ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యలు
- ఏపీకి మూడు రాజధానులన్న సీఎం జగన్
- అసెంబ్లీలో వ్యాఖ్యలు
- తీవ్ర చర్చనీయాంశంగా జగన్ ప్రకటన
ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేతలు అనేక భాష్యాలు చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను చూస్తుంటే రాష్ట్రం మూడు ముక్కలయ్యేట్టుందని, ఏపీ కాస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమగా విడిపోయే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. రాజధానిపై సీఎం తన ప్రకటన ద్వారా బీజేపీకి అవకాశం ఇచ్చినట్టయిందని అన్నారు.
విజయసాయి సహా ఇతర వైసీపీ నేతలు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టారని, అందుకే వైజాగ్ ను రాజధానిగా చెబుతున్నారని ఆరోపించారు. జగన్ ప్రకటన వెనుక టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలన్న కోణం తప్ప మరేమీ కనిపించడంలేదని కుటుంబరావు విశ్లేషించారు. జగన్ ప్రకటనను గంటా, కేఈ తదితరులు స్వాగతించడం కూడా ఈ కోణంలోనే చూడాలని, వారు రాజకీయ కారణాలతోనే జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నారని తెలిపారు.