Andhra Pradesh: మూడు రాజధానులంటే ఐదుగురు ఉపముఖ్యమంత్రులను పెట్టుకున్నంత సులభం కాదు: సుజనా చౌదరి

  • ఏపీకి మూడు రాజధానులన్న సీఎం జగన్
  • స్పందించిన సుజనా చౌదరి
  • జగన్ వైఖరి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుందన్న సుజనా

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పందించారు. జగన్ శాసనసభలో ఏం మాట్లాడాడో తనకు అర్థం కాలేదని అన్నారు. ఈ వారం రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. అయినా ఏపీకి మూడు రాజధానులు అంటే ఐదుగురు ఉపముఖ్యమంత్రులను పెట్టుకున్నంత సులభం కాదని ఎద్దేవా చేశారు.

"రాజధానిని అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ చేస్తారని జగన్ చెప్పకనే చెప్పారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అంటున్నారు. అంటే కేవలం సభా సమావేశాలు జరిగినన్ని రోజులే అమరావతి రాజధాని. మహా అయితే సంవత్సరంలో ఓ 40 రోజులు సభ జరుగుతుందేమో. మిగిలిన రోజులు విశాఖ నుంచి పరిపాలిస్తారని భావించాలి. అసెంబ్లీ సమావేశాల కోసమే రాజధాని అయితే, ఏ రిసార్ట్ లో అయినా నిర్వహించుకోవచ్చు.

ఏపీని దక్షిణాఫ్రికాతో పోల్చారు. దక్షిణాఫ్రికాలో చారిత్రక కారణాల రీత్యా హైకోర్టు ఒకచోట, సభ మరొక చోట ఏర్పాటైంది. కానీ అక్కడ రాజధాని ఒక్కటే. జగన్ వ్యాఖ్యలను చూస్తుంటే గత ఆర్నెల్లుగా నెలకొన్న పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నట్టుగా ఉంది" అంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News