Pant: పంత్, అయ్యర్ మెరుపుదాడి.... వైజాగ్ లో పరుగుల సునామీ
- వైజాగ్ లో రెండో వన్డే
- టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన వెస్టిండీస్
- విజృంభించిన భారత బ్యాట్స్ మెన్
- రోహిత్, రాహుల్ సెంచరీలు
- చితకబాదిన పంత్, అయ్యర్
వెస్టిండీస్ బౌలర్లకు వైజాగ్ పిచ్ పై చుక్కలు కనిపించాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా ఆ ఆనందం దక్కలేదు. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అదిరిపోయే స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 387 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నుంచి చివర్లో పంత్, అయ్యర్ వరకు వెస్టిండీస్ బౌలింగ్ ను ఉతికారేశారు.
రోహిత్ 138 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సులతో 159 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రాహుల్ 102 పరుగులు సాధించాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. ఇక కోహ్లీ డకౌట్ అయినా జట్టుపై ఆ ప్రభావం కనిపించలేదంటే అందుకు కారణం శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ అని చెప్పాలి.
వీరిద్దరూ చివరి ఓవర్లలో విండీస్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పంత్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ సైతం చివర్లో గేరు మార్చి సిక్సర్ల మోత మోగించాడు. చేజ్ విసిరిన ఓ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సులు సంధించాడు. అయ్యర్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కేదార్ జాదవ్ మూడు ఫోర్లతో సందడి చేశాడు. ఇక విండీస్ బౌలర్లలో కాట్రెల్ కు 2 వికెట్లు దక్కాయి. కీమో పాల్, జోసెఫ్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.