KTR: ఏరోస్పేస్, రక్షణ రంగాల పరిశ్రమలకు హైదరాబాద్ చక్కని వేదిక: కేటీఆర్
- కొత్త పరిశ్రమలకు తగిన సాంకేతిక సహకారం అందిస్తున్నాం
- బోయింగ్ సంస్థతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది
- అంకుర పరిశ్రమలకు టీ హబ్ సహకారం అందిస్తోంది
- సులభతర వాణిజ్య విధానంలోనూ ఆదర్శంగా నిలిచాం
ఏరోస్పేస్, రక్షణ రంగాల పరిశ్రమలకు హైదరాబాద్ చక్కని వేదిక అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రక్షణ రంగంలో భారత్-అమెరికా సంబంధాలపై హైదరాబాద్, తాజ్ కృష్ణ హోటల్ లో జరుగుతోన్న సదస్సులో ఆయన ప్రసంగించారు. తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ లో రక్షణ రంగ ఉత్పత్తులు చేయొచ్చని ఆయన తెలిపారు. కొత్త పరిశ్రమలకు తగిన సాంకేతిక సహకారం అందిస్తున్నామని, బోయింగ్ సంస్థతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుందని ఆయన చెప్పారు.
అంకుర పరిశ్రమలకు టీ హబ్ సహకారం అందిస్తోందని, తెలంగాణ సులభతర వాణిజ్య విధానంలోనూ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ లో సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైమానిక రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని చెప్పారు. బోయింగ్, జీఈ, అధాని వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ ఉత్పత్తులు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.