Maharashtra: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడి జలియన్ వాలాబాగ్ ఘటనను తలపించింది: ‘మహా’ సీఎం ఉద్ధవ్ థాకరే
- జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్ లో పోలీసుల ప్రవేశంపై ఆగ్రహం
- యువత దేశం భవిష్యత్తు.. వారిని అస్థిర పరుచవద్దు
- ఇలాంటి ఘటనలు భీతిగొల్పే వాతావరణాన్ని సృష్టిస్తాయి
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన బాటపట్టిన ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం అమానుషమంటూ.. ఇది జలియన్ వాలా బాగ్ ఘటనను తలపిస్తోందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు భీతిగొల్పే వాతావరణాన్ని సృష్టిస్తాయన్నారు.
‘ఇది సమాజంలో అశాంతి, అస్థిర వాతావరణాన్ని నెలకొల్పడానికి చేసిన ప్రయత్నం. పోలీసులు బలవంతంగా క్యాంపస్ లోకి ప్రవేశించి విద్యార్థులపై కాల్పులకు దిగడం జలియన్ వాలాబాగ్ హింసను తలపించింది’ అని థాకరే పేర్కొన్నారు. యువతను ఆందోళనకు గురిచేసిి, ఏ దేశం స్థిరంగా ఉండదన్నారు. ‘యువత’ దేశం భవిష్యత్తంటూ.. వారిని అస్థిరపరిచే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.