Telangana: తెలంగాణలో మద్యం ధరల పెంపు వెనుక 'కేఎస్ టీ' మాఫియా ఉంది: రేవంత్ రెడ్డి
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ ధ్వజం
- ప్రజలకు బహిరంగ లేఖ
- కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అంటూ విమర్శలు
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. తెలంగాణలో మద్యం ధరలు పెంచడం వెనుక కేఎస్ టీ మాఫియా ఉందన్నారు. కేఎస్ టీ అంటే కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్ అని అభివర్ణించారు. తెలంగాణలో ఏం చేయాలన్నా 6 శాతం కమీషన్ చెల్లించాల్సిందేనని ఆరోపించారు. తాజాగా మద్యం ధరల పెంపు వ్యవహారం ఆషామాషీగా తీసుకున్నది కాదని, ఇదో పెద్ద కుంభకోణం అని తెలిపారు. ఓ ఎంపీ చెన్నై, ఢిల్లీల్లో బేరసారాలు జరిపి ఈ ఒప్పందం కుదిర్చారని రేవంత్ వివరించారు.
కమీషన్లు ఇచ్చే బ్రాండ్లనే విక్రయిస్తున్నారని, మద్యం అమ్మకాల్లో దోపిడీ కోసమే ప్రభుత్వం గుత్తాధిపత్య ధోరణితో వెళుతోందని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయం కంటే 1000 శాతం అధికంగా ధరలు నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామ కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.