Disha: దిశ నిందితుల మృతదేహాలు పాడవకుండా ఖరీదైన ఇంజెక్షన్లు!
- మృతదేహాలకు ఎంబామింగ్
- శవాలు మరికొన్నిరోజులు పాడవకుండా ఉండేందుకు చర్యలు
- రెండ్రోజుల్లో త్రిసభ్య కమిషన్ రాక
దిశ ఘటన నిందితులను ఇటీవలే ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో పోలీసులకు చిక్కొచ్చిపడింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపొద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కానీ గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉన్న ఆ మృతదేహాలు క్రమంగా కుళ్లిపోతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఆ నాలుగు మృతదేహాలకు ఖరీదైన ఎంబామింగ్ ప్రక్రియ నిర్వహించారు.
ఎంబామింగ్ చేయడం ద్వారా శవాలను మరికొన్నిరోజులు తాజాగా ఉంచే వీలుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా దిశ నిందితులకు ఒక్కొక్కటి రూ.7500 ఖరీదైన ఇంజెక్షన్లు వేశారు. ఒక్క ఇంజెక్షన్ తో నాలుగు రోజుల పాటు మృతదేహం పాడవకుండా ఉంటుంది. త్రిసభ్య కమిటీ పరిశీలించిన అనంతరం మృతదేహాలపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.
కాగా, నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించడంతో కేసు దర్యాప్తును ముగిస్తున్నట్టు పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరో రెండ్రోజుల్లో త్రిసభ్య కమిటీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో, ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.