Rajinikanth: ఆ పాత్రను పోషించాలని ఉంది: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

  • 45 ఏళ్లలో 160 చిత్రాల్లో నటించా
  • ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమున్నాయా అని ఆలోచించా
  • మరాఠీ సినిమాలో నటించాలనే ఆసక్తి కూడా ఉంది

తనకు ట్రాన్స్ జెండర్ పాత్రను పోషించాలని ఉందని సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం 'దర్బార్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గత 45 ఏళ్లలో నేను దాదాపు 160 చిత్రాల్లో నటించా. ఇంకా చేయాల్సిన పాత్రలు ఏమున్నాయా అని ఆలోచించా. ట్రాన్స్ జెండర్ పాత్ర ఒకటి మిగిలిపోయింది. అది చేయాలనుకుంటున్నా' అని చెప్పారు.

ఈ పాత్రను పోషించాలంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? అని రజనీని మీడియా ప్రశ్నించగా... 'ఇంత వరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు. ట్రాన్స్ జెండర్ పాత్రను పోషించాలనే ఆసక్తి ఉందనే విషయాన్ని ఇప్పుడే బయటపెట్టా' అని బదులిచ్చారు.

మరాఠీ సినిమాలో నటించాలనే ఆసక్తి కూడా తనకుందని రజనీకాంత్ తెలిపారు. తమ ఇంట్లో తాను మరాఠీ కూడా మాట్లాడతానని చెప్పారు. మరాఠీ సినిమాలో నటించే అవకాశం తనకు గతంలో వచ్చినప్పటికీ... అది వర్కౌట్ కాలేదని తెలిపారు. ఇప్పుడు నటించాలనుకుంటున్నానని... ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు. 'దర్బార్' సినిమాను ముంబైలో 90 రోజుల పాటు చిత్రీకరించామని... ముంబై ప్రజలను తాను ఎంతో ప్రేమిస్తానని చెప్పారు.

రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ అనే విషయం తెలిసిందే. బెంగళూరులో ఓ మరాఠీ కుటుంబంలో ఆయన జన్మించారు. 'దర్బార్' సినిమాలో ఆయన పోలీస్ కమిషనర్ పాత్రను పోషిస్తున్నారు.

Rajinikanth
Transgender
  • Loading...

More Telugu News