Chennai: స్లో ఓవర్ రేట్ కారణంగా విండీస్ కు జరిమానా వడ్డించిన ఐసీసీ
- చెన్నై మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన కరీబియన్లు
- నిర్దేశిత సమయానికి 46 ఓవర్లు మాత్రమే విసిరిన విండీస్
- ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత
చెన్నైలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు టీమిండియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా విండీస్ బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తిచేయలేకపోయారంటూ ఐసీసీ జరిమానా విధించింది.
ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి విండీస్ 4 ఓవర్లు తక్కువగా బౌల్ చేసింది. అంటే కేటాయించిన సమయంలో 46 ఓవర్లు మాత్రమే విసిరింది. దాంతో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డట్టు గుర్తించిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ వెస్టిండీస్ ఆటగాళ్ల అందరి మ్యాచ్ ఫీజు నుంచి 80 శాతం కోత విధించాడు. తాము స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంపై శిక్షకు విండీస్ సారథి కీరన్ పొలార్డ్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.