Johnnie Walker: కమేడియన్ జానీవాకర్ దశ అలా తిరిగిందట!
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, అలనాటి బాలీవుడ్ స్టార్ కమెడియన్ 'జానీవాకర్' గురించి ప్రస్తావించారు. "సన్నగా .. బక్క పలచగా వున్న ఒక వ్యక్తి ముంబైలోని ఓ బస్సులో కండక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు. తమాషాగా కనిపించే ఆయన తన మాటకారితనంతో అందరినీ ఆకట్టుకునేవాడు.
ఒకసారి ఆ బస్సు ఎక్కిన బలరాజ్ సహానీ అనే నటుడు, ఆ కండక్టర్ ని గమనించాడు. ఆ కండక్టర్ ధోరణి చూసిన ఆయన, అతనిలో మంచి హాస్య నటుడు వున్నాడని గమనించాడు. ఆ తరువాత ఆయన ఆ కండక్టర్ గురించి తన మిత్రుడైన గురుదత్ కి చెప్పాడు. వెంటనే గురుదత్ ఆ కండక్టర్ వివరాలను సేకరించి ఆయనను ఆఫీస్ కి పిలిపించారు. ఆ కండక్టర్ కి స్క్రీన్ టెస్ట్ చేసిన గురుదత్, ఆయనలో మంచి కమెడియన్ వున్నాడని గ్రహించారు. 'ఇకపై నువ్వు కండక్టర్ జాబ్ చేయవలసిన అవసరం లేదు .. నీ పేరు జానీవాకర్' అని ఆ వ్యక్తితో అన్నారు. ఆ తరువాత జానీవాకర్ ఏ స్థాయికి చేరుకున్నాడన్నది అందరికీ తెలిసిందే" అని చెప్పుకొచ్చారు. అన్నట్టు జానీవాకర్ అసలు పేరు బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ!