Hyderabad: హైదరాబాద్‌కూ తాకిన పౌరసత్వ చట్టం నిరసన సెగలు.. విద్యార్థుల ఆందోళన
- రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపిన ‘మను’, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు
- కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
- ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసన
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు హైదరాబాద్‌కూ పాకాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల లాఠీచార్జీని ఖండిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను), కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు.
‘మను’ విద్యార్థులు గతరాత్రి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలతో ఆందోళనకు దిగారు. మరోవైపు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాత్రి 11:30 గంటల సమయంలో కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.