Onions: ఉల్లి కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు
- ఇంకా దిగిరాని ధర
- సంక్రాంతి తర్వాతే ఊరట అంటున్న మార్కెట్ వర్గాలు
- బహిరంగ మార్కెట్లో రూ.వందకు అటూఇటూ
బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో వంద రూపాయలకు అటూ ఇటూ ధర పలుకుతుండడంతో సంక్రాంతి తర్వాతే సాధారణ ధర సాధ్యమవుతుందేమోనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి ధర రూ.200 దాటిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో ధరపై విపరీతమైన ప్రభావం కనిపించింది. ఇప్పుడు అదే మహారాష్ట్ర నుంచి రబీ పంట అందుబాటులోకి రావడంతో ధర కాస్త దిగి వచ్చింది. అయినా ధర సామాన్యుడికి అందుబాటులో లేదు.
దీంతో రైతుబజార్లలో ప్రభుత్వం రూ.25లకు అందిస్తున్న సబ్సిడీ ఉల్లి కోసం జనం బారులు తీరుతున్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిపాయలు కూడా మరో వారం దాటితేగాని అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పుడప్పుడే ధర అదుపులోకి వచ్చే అవకాశం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.