cuddupha: వానర ప్రేమికుడు...వందల కోతుల ఆకలి తీర్చుతున్న ఆత్మబంధువు!
- ఆంజనేయ స్వామి భక్తుడు ఈ చిరుద్యోగి
- వానరాల్లో తన స్వామిని చూసుకుంటూ సేవ
- గండి క్షేత్రంలోని వానరాలు ఆయన్ను చూస్తే పరుగున వస్తాయి
ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు. మరి మూగజీవాల ఆకలి తీర్చితే...అదే దైవ సేవ అనుకుంటున్నాడో చిరుద్యోగి. ఆంజనేయునికి అపర భక్తుడైన ఈయన వానరాల్లో తన స్వామిని చూసుకుంటూ వాటికి ఆహారం అందించి ఆత్మబంధువుగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే..కడప జిల్లా ప్రొద్దటూరుకు చెందిన చినరంగనాయకులు పోస్టల్ శాఖలో చిరుద్యోగి. ఆంజనేయుని భక్తుడు. కడప జిల్లాలోని ప్రసిద్ధ గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామిని ఐదేళ్ల క్రితం దర్శించుకున్నాడు.
ఆ సమయం లో క్షేత్రంలోని వానరాలు ఆకలితో అలమటిస్తున్నాయని గ్రహించాడు. స్వామి రూపానికి అక్కడ వానరాలు ప్రతి రూపమని భావించి వాటి ఆకలి తీర్చేందుకు నడుం బిగించాడు. రోజూ ప్రొద్దటూరులోని మార్కెట్లో అరటి పండ్లు, టమాటాలు, రేగు పండ్లు, దానిమ్మ, దోస తదితరాలను కొని రెండు సంచుల్లో నింపుతాడు.
అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని గండి క్షేత్రానికి బస్సులో వస్తాడు. అతన్ని చూడగానే ఆ చుట్టుపక్కల ఉన్న వానరాలన్నీ చుట్టుముట్టేస్తాయి. తెచ్చిన ఆహారాన్ని వాటికి అందించి సంతృప్తిగా వెనుదిరుగుతాడు. ఏళ్లుగా సాగుతున్న ఈ దైవసేవకు స్నేహితులే బాసటగా నిలుస్తున్నారని చినరంగనాయకులు వినమ్రంగా చెబుతారు.