Mobile Hacking chances at Mobil charging stations: ఎక్కడపడితే అక్కడ ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటే హ్యాకింగ్ ప్రమాదం: హెచ్చరించిన ఎస్.బి.ఐ
- వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్
- మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ చేస్తే డేటా చోరీ, ఫోన్ హ్యాంకింగ్ ముప్పు
- సొంత ఛార్జింగ్ సెట్ లేదా పవర్ బ్యాంకులే మేలన్న బ్యాంకు
మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లలో డేటా చోరీ, ఫోన్ హ్యాకింగ్ ఏ విధంగా జరగవచ్చో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్.బి.ఐ) వినియోగదారులను హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. స్మార్ట్ ఫోన్లను ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవద్దని పేర్కొంది. ముఖ్యంగా ఛార్జింగ్ స్టేషన్లలో మొబైల్ ఛార్జింగ్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరమని పేర్కొంది. అసలు అక్కడ ఛార్జింగ్ చేసుకోకుంటేనే మంచిదని పేర్కొంది.
‘ఛార్జింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు ఆలోచించి ముందుకు సాగండి. మీ ఫోన్లలోకి మాల్ వేర్ ప్రవేశించవచ్చు. హ్యాకర్లు మీ పాస్ వర్డ్ లు చోరీచేసి డేటాను తెలుసుకునే ప్రమాదముంది’ అని తన ట్వీట్ లో పేర్కొంది. జ్యూస్ జాకింగ్ పేర సైబర్ దాడి జరుగుతోందని తెలిపింది.
ఛార్జింగ్ స్టేషన్లలో ఉండే పోర్ట్ లలో మొబైల్ ఛార్జింగ్ కేబుల్ చొప్పించగానే ఫోన్లో ఈ మాల్ వేర్ ఇన్ స్టాల్ అవుతుందని హెచ్చరించింది. తద్వారా మొబైల్ లోని డేటా మొత్తం చోరీకి గురవుతుందని పేర్కొంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే. సొంత ఛార్జింగ్ సెట్ ను లేదా ఎలక్ట్రికల్ అవుట్ లెట్ నుంచి నేరుగా ఛార్జ్ చేసుకోవడం, పవర్ బ్యాంక్ ఉపయోగించడం చేయాలని ఓ వీడియోలో సూచించింది.