YSRCP: వైసీపీ సభ్యులు ‘చంద్ర జపం’ చేస్తున్నారు: చంద్రబాబునాయుడు
- రామ జపం వదిలి నా జపం చేస్తున్నారు
- హుందాతనం లేని అసెంబ్లీ
- వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి మంచి చేయలేదు
శాసనసభలో ఏ వైసీపీ సభ్యుడూ తన పేరు ప్రస్తావించకుండా మాట్లాడడం లేదని, ‘చంద్ర జపం’ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. మంగళగిరిలో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ‘రామ జపం వదిలిపెట్టి నా జపం చేస్తున్నారు. తమాషాగా ఉంది మీకు. హుందాతనం లేని అసెంబ్లీ, హుందాతనం లేని విషయాలు.. కక్ష సాధింపు చర్యలు’ అని ఆయన మండిపడ్డారు.
వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టింది కక్ష సాధింపు చర్యల కోసం కాదన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఎటువంటి మంచి చేయకుండా, కేవలం, ‘స్లోగన్స్’తో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విమర్శించారు. ‘రివర్స్ టెండరింగ్’ పేరిట ఓ ఐదారు కంపెనీలకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేల కంపెనీలు, వాళ్ల మంత్రుల కంపెనీలకు, కావాల్సిన కంపెనీలకు ఈ కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ.. ‘పారదర్శకత’ అని చెప్పుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. చేసేవన్నీ తప్పుడు పనులు, బయటేమో పెద్దమనుషుల మాదిరి చలామణి కావాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు.