Telugudesam: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కృష్ణ కిశోర్ ను సస్పెండ్ చేశారు: చంద్రబాబునాయుడు
- డిప్యుటేషన్ పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేస్తారా?
- జగన్ తనతో పాటు జైలులో ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు ఇచ్చారు
- వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు
అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పని చేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను ఏపీ ప్రభుత్వం నిన్న సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణ కిశోర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? అసెస్ మెంట్ బృందంలో ఆయన ఉండటమే ఆయన నేరమా? అని ప్రశ్నించారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ని సస్పెండ్ చేశారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. జగన్ క్విడ్ ప్రోకో ద్వారా అవతలి వ్యక్తులకు ఆదాయం వచ్చేలా చేయడాన్ని ఆరోజున ఎవరైతే తప్పుబట్టారో ఈరోజున వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ తనతో పాటు సహనిందితులుగా ఉన్న వారిని తన సలహాదారులుగా పెట్టుకున్నారని, జైలులో తనతో పాటు ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదవులు ఇచ్చారని విమర్శించారు.