Congress: తెలంగాణ ఇప్పుడు ఎందుకు దివాలా తీసిందో కేసీఆర్ సమాధానం చెప్పాలి!: టీఆర్ఎస్ సర్కార్ పై జగ్గారెడ్డి ఫైర్

  • లక్ష రూపాయల రుణమాఫీ హామీపై ఇంతవరకు స్పష్టత రాలేదు 
  • నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని చెప్పిన మాటనే మర్చిపోయారు
  • కేసీఆర్, తన కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లోనే అభివృద్ధా? 

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ.. పలు హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలావరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. జగ్గారెడ్డి ఈ రోజు గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, రెండో సారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

తర్వాత మాట్లాడుతూ, లక్ష రూపాయల రుణమాఫీ హామీపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని ఎత్తి చూపారు. దీనిపై కేసీఆర్ రైతులకు జవాబు చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామన్న మాటనే మర్చారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పన్నెండువేల పాఠశాలలను ఎందుకు మూసివేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం, గుడ్లు అందడం లేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలు వైద్యంకోసం అగచాట్లు పడుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ అమలు అటకెక్కిందని విమర్శించారు.

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎందుకు దివాలా తీసిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, తన కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లోనే అభివృద్ధా? మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేపట్టరా ? అంటూ నిలదీశారు.

Congress
MLA Jagareddy criticism against TRS govt and KCR promises
  • Loading...

More Telugu News