liquor ban demand: మద్య నిషేధంపై అలుపెరగని పోరాటం చేస్తాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్
- డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ మహిళా సంకల్ప దీక్ష ప్రారంభం
- హైదరాబాద్ బ్రాండ్ అంటూ కేటీఆర్ ‘బ్రాందీ’ హైదరాబాద్ గా మార్చారు
- సామాజిక బాధ్యతను గుర్తెరిగి మద్యాన్ని సీఎం కేసీఆర్ నిషేధించాలి
తెలంగాణలో దిశ హత్య తర్వాత మద్యంపై చర్చ సాగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షకు లక్ష్మణ్ మద్దతు పలుకుతూ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. 'హైదరాబాద్ బ్రాండ్' అంటూ ట్వీట్ చేసే కేటీఆర్ ‘బ్రాందీ’ హైదరాబాద్ గా మార్చారని విమర్శించారు. బీజేపీ మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని పేర్కొన్నారు.
తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ తల్లి కడుపుకోతకు మద్యం కారణం కాకూడదన్నారు. సీఎం కేసీఆర్ సామాజిక బాధ్యతను గుర్తెరిగి మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసం దీక్ష చేయడంలేదని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలను నిరోధించేందుకే తాము సంకల్ప దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్షతో.. తమ ఉద్యమం ఆగదన్నారు. మద్య నిషేధం కోరుతూ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.
‘మద్యం నియంత్రణ శాఖను మద్యం పెంచే శాఖగా మార్చారు. దరఖాస్తులతోనే రూ.980 కోట్లను ప్రభుత్వం సంపాదించింది. ప్రభుత్వానికి మద్యం ద్వారానే రూ.20,000 కోట్ల ఆదాయం లభించింది. హైదరాబాద్ లో పబ్, క్లబ్ సంస్కృతిని తీసుకొచ్చారు. ఇది మన సంస్కృతి కాదు. యువత ఈ విపరీత సంస్కృతికి బానిసై తమ జీవితాలను కోల్పోతున్నారు. మద్యం తల్లిదండ్రుల పాలిట గుది బండగా మారింది’ అన్నారు.