Andhra Pradesh: 'సాక్షి' పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ గతేడాది టీడీపీ సర్కారు జీవోలు జారీ చేయలేదా?: అసెంబ్లీలో మంత్రి బుగ్గన
- జగతి పబ్లికేషన్స్, సాక్షి ఎడిటర్ వివరణ ఇవ్వాలన్నారు
- మేము మాత్రం టీడీపీ ప్రభుత్వంలా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదు
- కేవలం అవాస్తవాలు ప్రచారం చేసే వారిపైనే చర్యలు
పత్రికా స్వేచ్ఛను హరించేందుకే వైసీపీ ప్రభుత్వం 2430 జీవోను తీసుకొచ్చిందని, దాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. అవాస్తవ కథనాలపై చర్యలు తీసుకునేందుకు జీవో తీసురావడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
ఆ జీవో కేవలం ఒక పత్రిక కోసం కాదని, అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకునే అధికారాలు సంబంధిత అధికారులకే ఉంటాయని బుగ్గన అన్నారు. ఇందులో రాజకీయ జోక్యం ఉండదని ఆయన తెలిపారు. గతంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ ప్రభుత్వ తీరును బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. పోలవరం నిర్వాసితుల గురించి ‘సాక్షి’ కథనాలు రాస్తే, చర్యలు తీసుకోవాలంటూ జీవోలు జారీ చేశారని అన్నారు.
సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ గతేడాది ఏప్రిల్ 24న ఓ జీవోను జారీ చేశారని, అలాగే అదే ఏడాది మే 18న జీవో 1088, అక్టోబరులో జీవో నంబరు 2151 జారీ చేశారని ఆయన అన్నారు. జగతి పబ్లికేషన్స్, సాక్షి ఎడిటర్ వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారని చెప్పారు. తాము మాత్రం టీడీపీ ప్రభుత్వంలా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని అన్నారు. కేవలం అవాస్తవాలు ప్రచారం చేసే వారిపైనే చర్యలు తీసుకుంటామన్నారు.