Chandrababu: జగన్ కు క్షమాపణలు చెప్పబోనన్న చంద్రబాబు... ఆయన చెబుతారని తాననుకోవడం లేదన్న జగన్!
- క్షమాపణలు చెప్పేది లేదన్న చంద్రబాబు
- చంద్రబాబు నోటి వెంట క్షమాపణలా?
- మానవత్వం లేని వ్యక్తి నుంచి ఊహించలేమన్న జగన్
తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెబుతారని అనుకోవడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తనను 'ఉన్మాది' అని సంబోధించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తాను జగన్ కు క్షమాపణలు చెప్పేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంపై జగన్ స్పందించారు.
ఏ మాత్రం మానవత్వం లేని వ్యక్తి, నోరు జారి ఆ తరవాత మన్నించాలని కోరుతారని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరితో సభా సమయం వృథా అవుతోందని మండిపడ్డారు. అసెంబ్లీని కాపాడే మార్షల్స్ ను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారని జగన్ అసెంబ్లీకి తెలిపారు.
ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని కల్పించుకుని, నేడు సభలో జరిగిన ఘటనలను, సభ బయట జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను తెప్పించుకుని పరిశీలిస్తానని అన్నారు. వాస్తవాలను తెలుసుకుంటానని, ఆపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. క్షమాపణలు చెప్పేందుకు చంద్రబాబునాయుడు నిరాకరించిన నేపథ్యంలో, నిజానిజాలను తెలుసుకున్న తరువాత ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు.